తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారని తెలిసింది. ఇప్పటివరకు 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారు 1,28,079 మంది ఉన్నారు. వీరిలో 1,27,372 మందికి మెడికల్ కిట్లను ఆరోగ్య సిబ్బంది పంపిణీ చేశారు. చాలా మందిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండా స్థానిక వైద్యుల సహకారంతో మందులు వాడుతున్నట్లు అధికారలు సర్వేలో వెల్లడైంది.
Read Also: టెన్త్, ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎవరిలోనైనా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తే వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నట్లు సర్వే నిర్వహిస్తున్న అధికారులు చెప్తున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం కూడా ఫీవర్ సర్వేను అధికారులు నిర్వహించనున్నారు. ఈ సర్వేలో పెద్దల, చిన్నారుల ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. మరో ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగనుంది.