తెలుగు దేశం పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముందుగా టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్కరోజు తేడాలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కరోనా వలలో చిక్కుకున్నారు. అంతకుముందు కూడా పలువురు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డా… ఇప్పుడు వరుసగా సీనియర్ నేతలకు కరోనా సోకడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు దేవినేని ఉమా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో పలు అంశాలను చర్చించేందుకు వారిని ఎంతమంది టీడీపీ నేతలు కలిశారో… వారందరూ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.
నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Devineni Uma (@DevineniUma) January 18, 2022