ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత యూపీతో పాటు దేశ వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్, హత్రాస్, సహరాన్ పూర్ ఏరియాల్లో రాళ్ల దాడులు, ఆస్తుల విధ్వంసం జరిగింది. దీంతో అక్కడి యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కన్నెర్ర చేసింది. ఇప్పటికే 300కు పైగా నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితులకు సంబంధించి వారి అక్రమ ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది ప్రభుత్వం.
తాజాగా ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో విచారణ జరుగుతోంది. యూపీలో నిందితుల ఇళ్లు కూలగొట్టకుండా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా జమియత్- ఉలేమా- ఏ- హింద్ సంస్థ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఈ పిటిషన్ ను కోర్ట్ విచారిస్తోంది. అక్రమ కూల్చివేతకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది సుప్రీం కోర్ట్ ను పిటిషన్ దారులు కోరారు. యూపీలో జావెద్ మహ్మద్ ఇంటితో సహా మరికొంత మంది ఇళ్లను కూల్చివేయడంపై ఈ పిటిషన్ దాఖలు చేశారు.
జమియత్ ఉలేమా ఏ హింద్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ కు వ్యతిరేఖంగా రెస్పాండ్ కావాలని.. మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వారం విచారణ జరుపుతామని కేసును వాయిదా వేసింది.అయితే కూల్చివేతకు స్టే ఇవ్వలేమని.. అయితే కూల్చివేతలు చట్టప్రకారం జరగాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యూపీ ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. యూపీలో సరైన ప్రక్రియలోనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆయన సుప్రీంకు తెలిపారు. ఢిల్లీ జహంగీర్ పురి ప్రాంతంలో ఏ వర్గానికి చెందని ఆస్తి ఉందో చూడకుండా నిర్మాణాలను తొలగించారని..ఇటువంటి కూల్చివేతలు సరైన ప్రక్రియలోనే సాగుతున్నాయని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో పిటిషనర్ల తరుపున వాదిస్తున్న సీయూ సింగ్.. కూల్చివేతలకు ముందు 15-40 రోజుల డెడ్ లైన్ ఉండాలని, కూల్చివేతలకు ముందు నోటీసులు అందించాలని సుప్రీంను కోరారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆరోపించారు.