కరోనా నేపథ్యంలో గేట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను గందరగోళానికి, అనిశ్చితికి గురిచేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం గేట్ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టి తీర్పు వెల్లడించింది.
Read Also: విచిత్రం: ఆ నగరంలో కార్లను లాక్ చేయరు… ఇదే కారణం
గేట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యజమాని కూడా ఉన్నట్లు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. గేట్ పరీక్షలకు 9 లక్షల మంది హాజరవుతున్నారని… ఇందులో కేవలం 20 వేల మంది మాత్రమే పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారని… దీనిపై అధికారులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. అకడమిక్ విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ప్రమాదకరమని అభిప్రాయపడింది. రెండు రోజుల్లో పరీక్షలు పెట్టుకుని ఇప్పుడు వాయిదా వేయాలని కోరడం సబబు కాదని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.