శ్రీలంకలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పవన విద్యుత్ ప్రాజెక్ట్ పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై ఒత్తడి తీసుకువచ్చి ఎలాంటి బిడ్డింగ్ లేకుండా అదానికి పవర్ ప్రాజెక్ట్ కట్టబెట్టారని శ్రీలంకలోని కొన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఇండియాలో ప్రతిపక్షాలు మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. నరేంద్ర మోదీ, రాజపక్సల మద్య అవాస్తవ ఒప్పందం కుదిరిందని కొంత మంది శ్రీలంక ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా కొలంబో ‘‘ స్టాప్ అదానీ’’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఒప్పందం చట్టవిరుద్దమైనదిగా ప్రజలు ఆరోపిస్తున్నారు.
తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభంలో ఉన్న శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్ట్ అదాని గ్రూప్ దక్కించుకునేలా.. శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా అదానీ ఒప్పందాన్ని సులభతరం చేసేందుకు విద్యుత్ చట్టానికి సవరణ చేసి ఆమోదించింది. 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ దక్కించుకోవడంపై ‘స్టాప్ అదానీ’ పేరుతో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంకలోని సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఇది ట్రెండింగ్ లో ఉంది. అయతే భారత్ సాయానికి మేం వ్యతిరేకం కాదని.. అయితే బిడ్డింగ్ లేకుండా పవర్ ప్రాజెక్ట్ దక్కించుకోవడం అనుమానాలకు తావిస్తుందని శ్రీలంక ప్రజలు అంటున్నారు. అయితే విలువైన పొరుగు దేశం అవసరాలను తీర్చడం మా బాధ్యత అని అదానీ గ్రూప్ చెబుతోంది. ఇప్పటికీే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న శ్రీలంకను ఇటువంటి ఒప్పందాలు మరింత చీకటిలోకి నెట్టేస్తాయని అక్కడి ప్రజలు అంటున్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక పవర్ ప్రాజెక్ట్ ను అదానీకి ఇవ్వాలని అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తడి చేశాడని.. శ్రీలంక సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో పార్లమెంటరీ ప్యానెల్ కు చెప్పడంతో వివాదం మొదలైంది. అయితే శ్రీలంక అధ్యక్షుగు గొటబయ రాజపక్స ఈ వ్యాఖ్యాలను ఖండించారు. ఈ పరిణామాల తర్వాత ఫెర్నినాండో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.