బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్సులో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాటర్లలో మథ్యూస్(43), డిక్‌వెల్లా(21) తప్ప ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, అశ్విన్, షమీ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
ఓవర్‌నైట్ స్కోరు 86/6తో రెండో రోజు ఆట ఆరంభించిన శ్రీలంకను చుట్టేయడానికి రోహిత్ సేనకు ఎంతో సమయం పట్టలేదు. 27 నిమిషాల్లోనే మిగిలిన 4 వికెట్లను పడగొట్టేసింది. ఆడిన 35 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసింది. ఇండియాపై శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం విశేషం. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు రెండు పింక్ బాల్ టెస్టులు జరగ్గా.. ఆ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిశాయి. చూస్తుంటే బెంగళూరులో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు కూడా మూడు రోజుల లోపే ముగిసేలా కనిపిస్తోంది. బౌలర్లకు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై బౌన్స్ అనూహ్యంగా దూసుకొస్తోంది.