ప్రేమకు ఎల్లలు లేవంటారు.. హద్దులు లేవంటారు. అందుకే ఎవరు ఎవరి ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఉదాహరణకు మీకు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన పడమటి సంధ్యారాగం సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో విజయశాంతి అమెరికాకు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తాజాగా అచ్చం ఇదే తరహాలో ఏపీకి చెందిన ఓ అబ్బాయి అమెరికా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కందుల కామరాజు- లక్ష్మీ దంపతుల కుమారుడు కిరణ్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో చదువుకున్నాడు. అయితే అదే యూనివర్సిటీలో చదువుతున్న డెట్రాయిట్ సిటీకి చెందిన మోర్గన్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.
చదువు పూర్తయిన తర్వాత వీళ్లిద్దరూ అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వధువు తల్లిదండ్రుల కోరిక ప్రకారం అమెరికాలోనే మోర్గన్‌ను అక్కడి సంప్రదాయాల ప్రకారం కిరణ్ వివాహం చేసుకున్నాడు. అనంతరం భారతీయ సంస్కృతిని అమితంగా ఇష్టపడే మోర్గన్ కోరికతో ఈనెల 15న ఉదయం 7:15 గంటలకు రాజాంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో హిందూ సాంప్రదాయ ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. అమెరికా అమ్మాయితో జరిగే వివాహాన్ని చూసేందుకు రాజాం వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించడం విశేషం.
Andhra Pradesh: నిరుద్యోగులకు గమనిక.. హెచ్‌సీఎల్ వాక్ ఇన్ డ్రైవ్