తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ ధరలను పెంచాలని అంటోంది. నిర్వహణ వ్యయం అధికం కావడం వల్ల టికెట్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచాల్సిందేనని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. రూపాయి మారకపు విలువ పడిపోవడం, ఇంధన ధరలు అధిక కావడం వల్ల సంస్థకు నిర్వహణ వ్యయం పెరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచాలని జెట్ ఎయిర్‌వేస్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. దీనివల్ల తమకు కొంతవరకు భారం తగ్గుతుందని చెప్పారు.
‘‘2021 జూన్ నుంచి ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధర 120 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఏటీఎఫ్‌పై పన్నులు తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్ని నెలలుగా విమాన ఇంధన ధరలను భరించేందుకు వీలైనంతగా ప్రయత్నించాం. మా నిర్వహణ వ్యయాల్లో దాదాపు 50శాతానికి పైగా ఇంధనానికే ఖర్చవుతోంది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తుండటం ఎయిర్‌లైన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ ఖర్చులను భరించాలంటే విమాన టికెట్ ధరలను కనీసం 10 నుంచి 15 శాతం పెంచడం తప్ప మరో మార్గం కన్పించట్లేదు’’ అని అజయ్ సింగ్ అన్నారు.
Srilanka: 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లు.. ప్రశంసల వర్షం
కరోనా దృష్ట్యా విధించిన లాక్‌డౌన్ కారణంగా 2020 మార్చి-ఏప్రిల్ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత మే 25, 2020 నుంచి దశల వారీగా విమాన సర్వీసులను పునరుద్ధరించారు. అయితే, ఆ సమయంలో అటు ప్రయాణికులపై అదనపు భారం పడకుండా, ఇటు విమానయాన సంస్థలకు నష్టం వాటిల్లకుండా కేంద్ర పౌరవిమానయాన శాఖ చర్యలు తీసుకుంది. విమాన టికెట్ల ధరలపై ప్రయాణ సమయం ఆధారంగా పరిమితి విధించింది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు కొండెక్కాయి. దీంతో నిర్వహణ భారంగా మారిందని ఎయిర్‌లైన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.