NTV Telugu Site icon

సరిగమప సీజన్ 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ లాంచ్

097a4272 (1)

097a4272 (1)

‘జీ తెలుగు’ వినోదాల పరంపరను కొనసాగిస్తూ జీ తెలుగు పాపులర్ షో సరిగమప సరికొత్త సీజన్ తోవచ్చేస్తోంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో విజయవంతంగా 15 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ ప్రెస్టీజియస్ షో తదుపరి సీజన్ ని ఘనంగా ప్రారంభిస్తోంది. సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ సెప్టెంబర్ 29న, సా|| 6:00 ప్రారంభం కానుంది. అక్టోబర్ 6 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ షో అలరించబోతుంది.

తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గాయకులకు ప్రోత్సహించే లక్ష్యంతో డ్యాన్సింగ్, సింగింగ్ షోలతో మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తోంది జీ తెలుగు. ఇందులో భాగంగానే విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చేసుకున్న సింగింగ్ షో ‘స రి గ మ ప’ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో గాయనీ గాయకులు విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే మూడు జట్లుగా పోటీపడతారు. ఈ జట్లకు మెంటర్లుగా రేవంత్, రమ్య బెహరా, అనుదీప్ దేవ్ నాయకత్వం వహిస్తారు. ఈ సీజన్కు ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో సరిగమప సీజన్ 16 ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఎపిసోడ్ లో మూడు జట్లను సపోర్ట్ చేసేందుకు ముగ్గురు ప్రముఖ సింగర్స్ హాజరు కానున్నారు. విలేజ్ వోకల్స్ ను పెంచల్ దాస్, సిటీ క్లాసిక్స్ ను చిన్మయి సపోర్ట్ చేస్తుండగా మెట్రో మెలోడీస్ ను కేదన్ శర్మ సపోర్ట్ చేయనున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాస్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, హైదరాబాదీ పాపులర్ రాపర్ కేదన్ శర్మ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఉర్రూతలూగించనున్నారు. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే కంటెస్టెంట్స్ రకరకాల జోనర్స్ పాటలతో పోటీపడనున్నారు.

జీ తెలుగు సరిగమప సీజన్ 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ లాంచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని సెప్టెంబర్ 25 న హైదరాబాద్లో నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కొత్త సీజన్ హోస్ట్, జడ్జిలు, మెంటర్లు, కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జీలు ఈ సీజన్ ప్రత్యేకతల గురించి మీడియాతో మాట్లాడుతూ సంగీతంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – అనురాధ గూడూరు మాట్లాడుతూ, “యువ, అసాధారణ ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ లాంచ్ ప్యాడ్ గా ఉన్న జీ తెలుగు సరిగమప సీజన్ 16 ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్లో సింగింగ్ యూత్ ఐకాన్ కోసం పోటీ జరుగుతుంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోనూ ప్రతిభావంతులైన గాయనీగాయకులను ప్రోత్సహించడమే మా లక్ష్యం. ఇప్పటికే మనం చూసిన ఎనర్జీ, ప్యాషన్, టాలెంట్ చెప్పుకోదగ్గవి. తమ కలలను నిజం చేసుకోవడమే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే ఓ వేదికను అందించడమే మా ఉద్దేశం. ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.