NTV Telugu Site icon

Priyanka Gandhi: పార్లమెంట్‌లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతా

Priyanka

Priyanka

వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రియాంకాగాంధీ ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతానని ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని గుర్తుచేశారు. తన తల్లి సోనియా.. భర్త, పిల్లలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని వెల్లడించారు. తన వెనుకండి నడిపించిన సోదరుడు రాహుల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక విజయం సాధించిన తర్వాత ప్రియాంక.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి స్వీట్లు తినిపించుకున్నారు.

వయనాడ్ లోక్‌సభ బైపోల్స్‌లో ప్రియాంక కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. 4,10,931 ఓట్ల మెజార్టీ అందుకున్నారు. ప్రియాంక గెలుపుపై భర్త రాబర్ట్ వాద్రా స్పందిస్తూ.. వయనాడ్ ప్రజల గొంతుక అవుతుందని తెలిపారు. అలాగే ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే నవంబర్ 25 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సోమవారమే ప్రియాంక లోక్‌సభలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సోదరుడితో కలిసి లోక్‌సభలోకి ప్రవేశించి.. ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.