హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ కట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రాలలో యాగశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహం బరువు 1800 కిలోలు కాగా.. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో అతి పెద్ద విగ్రహం ఇది.
కాగా రామానుజుల బంగారు విగ్రహానికి నిత్యపూజలు జరిగేలా చిన్నజీయర్ స్వామి ఏర్పాట్లు చేశారు. విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించేలా లైటింగ్ పెట్టారు. మొత్తం 216 అడుగుల్లో రామానుజ విగ్రహం 108 అడుగుల కాగా… పద్మపీఠం 27 అడుగులు. రామానుజ విగ్రహం దిగువన భద్రవేదిక 54 అడుగులు ఉంటుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.