President Award: ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గ్రామపెద్దలు. నందిగామ నియోజకవర్గం చంద్రళ్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ సర్పంచ్ కుసుమ రాజు వీరమ్మ, ఉప సర్పంచ్ నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో ముప్పాళ్ల గ్రామాన్ని సామాజిక న్యాయం, సోషల్ సెక్యూరిటీ పంచాయతీ విభాగంలో అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా న్యాయంపూడి, అనకాపల్లి జిల్లా తగరంపూడి పంచాయతీలు కూడా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను అందుకున్నాయి.
Read Also: Swarnandhra @ 2047 Vision Document: స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ..
ఈ సందర్భంగా సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ మాట్లాడుతూ.. గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదుగా వార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముప్పాళ్ళ గ్రామపంచాయతిని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 11వ తారీకునే కోటి రూపాయలు పంచాయతీ అకౌంట్‌లో జమయ్యాయి. ఈ నగదుతో గ్రామ పంచాయతీకి అవసరమైన వసతులు సమకూర్చి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ అన్నారు.