సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్నిపథ్ ఆందోళనలతో చెలరేగిన హింసపై విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు? వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు? వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. రైల్వే యాక్ట్‌లో ఒక్కసారి కేసులు నమోదైతే మాఫీలు ఉండవని అధికారులు వెల్లడించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ యాజమాన్యాల కుట్ర ఉందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. కుట్ర వెనక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల యజమానులను కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే కీలక నిందితుడు ఆవుల సుబ్బారావును అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..: సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజిన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు రాకేష్ మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.