సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు వరంగల్‌కు చెందిన దామోదర్‌గా పోలీసులు గుర్తించారు. దామోదర్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 8 మందికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.
కాగా సికింద్రాబాద్ ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించకుండా స్టేషన్‌కు వెళ్లే సమీప మార్గాలన్నింటినీ మూసివేశారు. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సులను సైతం నిలిపేశారు. దీంతో ముందుగా ప్రయాణాలకు సిద్ధమై స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా మూసివేశారు. ప్రయాణికులెవ్వరూ రైల్వేస్టేషన్‌కు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లను వరంగల్ స్టేషన్‌లోనే నిలిపివేశారు.