అక్షయ తృతీయ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా ప్రభావంతో గత రెండేళ్లు అక్షయ తృతీయ కళ తప్పగా.. ఈ ఏడాది మాత్రం బంగారం విక్రయాలు పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధర కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలోని జ్యువెలరీ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.
అయితే సందట్లో సడేమియా లాగా పలు షాపుల్లో యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు విజయవాడలోని పలు జ్యువెలరీ షాపులపై అధికారులు దాడులు జరిపారు. మూడు టీమ్‌లుగా అధికారులు విడిపోయి నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యనమలకుదురులోని ఓ జ్యువెలరీ షాపులో బంగారాన్ని తూకం వేసే నాన్ స్టాండర్డ్ మిషన్‌ను అధికారులు సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం నాన్ స్టాండర్డ్ మిషన్‌లను వాడకూడదని అధికారులు స్పష్టం చేశారు. కాగా బంగారు అభరణాలు కొనుగోలు చేసే ముందు రిజిస్ట్రేషన్ ముద్ర, బీఐఎస్ హాల్ మార్క్‌ను పరీక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.