Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సిద్ధాంతాలకు, విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారంటూ స్థానిక నేతల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ముఖ్యమైన నాయకులే క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడం వల్ల క్యాడర్ ఇబ్బంది పడుతోందంటూ… హెడ్ క్వార్టర్స్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. క్రమశిక్షణలేని వ్యవస్థను నడపలేనంటూ.. ఏకంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న కమిటీలన్నిటినీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం నెల్లూరు గ్లాస్‌లో కలకలానికి కారణమైంది. రెండున్నరేళ్ళ నుంచి ఇక్కడ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. జిల్లా అధ్యక్షునిగా మనుక్రాంత్ రెడ్డి ఉన్న సమయంలో మొదలైన వివాదాలు… ఆయన పార్టీ వదిలి వైసీపీలో చేరాక ఇంకా పెరిగిపోయాయి. స్థానిక నాయకులు ఎవరికి వారు… తామే నాయకులని చెప్పుకుంటూ…. పెత్తనం కోసం పాకులాడుతున్నారట. అలాంటి వాళ్ళలో చాలామంది బయటికి జనసేన జపం చేస్తూ….. తెర వెనుక మాత్రం మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పార్టీని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సంస్థాగతంగా నెల్లూరు జిల్లాలో జనసేన చాలా బలహీనంగా ఉందని సొంత పార్టీలోనే చెప్పుకుంటారు. అలాంటి చోట బలోపేతం కోసం చర్యలు తీసుకోకపోగా… అధిష్టానం అస్సలు పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని అంటున్నారు.
ముఖ్యంగా…. టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లా పార్టీని తన గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ గతంలో పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళాయి. అప్పుడే సీరియస్‌గా తీసుకుని సమస్యను పరిష్కరించి ఉంటే ఇప్పుడు ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయం ఎక్కువ మంది నాయకుల్లో ఉంది. అప్పుడు పెద్దలు లైట్ తీసుకోవడం వల్లే.. అజయ్‌కుమార్ తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకొని పాత తరం జనసేన ఇన్చార్జ్‌లను పక్కన పెడుతూ వచ్చారన్నది పార్టీ టాక్. ఆ చర్యలతో విసిగిపోయిన నేతలు అజయ్ కుమార్‌తో పాటు ఆయన వర్గంలోని వాళ్ళ మీద వరుసగా ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. కొన్ని ఆధారాలు ఉన్న నివేదికలను సైతం అధినేత దృష్టికి తీసుకెళ్లారట. జనసేన నెల్లూరు నగర అధ్యక్షునిగా ఉన్న సుజయ్ బాబు తన వర్గంతో వెళ్లి అధినేతను కలిసి జిల్లా పరిస్థితులను వివరించినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్య నేతలు నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా, తెలుగుదేశం పార్టీలోని మంత్రులు ఎమ్మెల్యేలతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులు అధినేతకు చేరాయని అంటున్నారు. వ్యక్తిగత లబ్దికోసం పార్టీ జెండాను అడ్డుపెట్టుకొని మంత్రులకు దగ్గరై అవసరమైన పనులు చేయించుకుంటున్నారని, పార్టీ కేడర్‌ని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని పవన్‌కు నివేదించినట్టు తెలిసింది. అజయ్ కుమార్, అతని వర్గం వల్లే జిల్లాలో పార్టీ డిస్ట్రబ్ అవుతోందని చెప్పారట. అలాగే… అంతర్గత విషయాలను కూడా కొందరు కోవర్టులు టీడీపీ కీలక నేతలకు చేరవేస్తున్నారన్న గుసగుసలు సైతం ఉన్నాయి.
సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారి కంటే.. సామాజిక వర్గాన్ని తెరమీదకు తీసుకొచ్చి పదవులు పొందిన వారే జిల్లాలో ఎక్కువగా ఉన్నారని, అలాంటి వాళ్ళపట్ల పాత క్యాడర్‌లో వ్యతిరేక పెరుగుతోందని అంటున్నారు. వైసీపీ నాయకులు తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను తిడితే పట్టించుకోని నెల్లూరు జనసేన నేతలు.. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతున్నారని, దీని మర్మం ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో తమ పార్టీ నాయకులకు ఉన్న ఫెవికాల్ బంధాన్ని కూడా… జిల్లా నేతలు కొందరు పవన్ దృష్టికి తీసుకువెళ్ళి… సత్వర చర్యలు తీసుకోకుంటే ప్రమాదమని కూడా హెచ్చరించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అన్ని విధాలా ఆలోచించి జిల్లా జనసేన కమిటీని రద్దు చేసినట్టు నెల్లూరులో ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉంటూ టిడిపికి సమాచారాన్ని చేరవేస్తున్న, వాళ్లు చెప్పినట్టు నడుచుకుంటున్న నేతల గురించి పవన్ ప్రత్యేకంగా అడిగినట్టు గ్లాస్ పార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలో పేపర్‌కే పరిమితమైన జనసేన సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో క్యాడర్‌లోకి తీసుకెళ్లే నేతల కోసం జనసేనాని అన్వేషిస్తున్నారట. ఆలోపు పార్టీకి డ్యామేజ్ జరగకుండా కమిటీని రద్దు చేసినట్లు సమాచారం. ఇక మీదట సీనియర్ నేతను జిల్లా అధ్యక్షుడిగా పెట్టి.. వర్గ విభేదాలు లేకుండా.. పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ గుర్తు వాడుకుంటూ సొంత పనులు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని నెల్లూరు జనసేనలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన కొందరు నేతల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్న పవన్ కల్యాణ్.. వాళ్ళ పనితీరు, టీడీపీతో కలిసి చేస్తున్న పనులను నివేదిక రూపంలో తెప్పించుకున్నారట.. ఈ క్రమంలోనే కమిటీలను రద్దు చేసినట్లు తెలుస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకుని నెల్లూరు జిల్లాలో బలహీనంగా ఉన్న పార్టీని.. బలోపేతం చేయాలని అడుగుతున్నారు గ్లాస్ పార్టీ పాత నేతలు.

