14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతో వివిధ పంచాయతీలకు పాత నిధులు ఇవ్వలేం అంటూ కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ జవాబులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన 529.96 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపినట్లు పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెల్లడించారు.
రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం (2015-20) సిఫార్సు చేసిన మొత్తం నిధులలో సుమారు రూ. 529 కోట్లు విడుదల కాలేదు. ఈలోగా 14వ ఆర్థిక సంఘం అవార్డు కాలవ్యవధి ముగిసిపోయుంది.
ఈ కారణంగా స్థానిక సంస్థలకు ఆ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులను విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం తమకు తెలిపినట్లు మంత్రి వివరించారు. అయితే, 2020-2026 కాలానికి 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు సిఫార్సు చేసిన నిధులు యధావిధిగా విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విడుదల చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు.