టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల్లో ముగ్గురు ప్రముఖులు మృతి చెందడంతో టాలీవుడ్‌కు ఏమైందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నవంబర్ 27న ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక్కరోజు గ్యాప్‌లో అంటే నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనా వల్ల ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో రెండు రోజుల గ్యాప్‌లో నవంబర్ 30న దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Read Also: రెండో టెస్టులో కోహ్లీ కోసం బలయ్యేదెవరు?
మరోవైపు ఈ ఏడాది టాలీవుడ్‌కు అచ్చిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది కాలంగా చాలా మంది ప్రముఖులను టాలీవుడ్ కోల్పోయింది. వేదం మూవీతో ఆకట్టుకుని ఎన్నో సినిమాల్లో నటించిన నాగయ్య ఈ ఏడాది మార్చి 27న చనిపోయారు. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు మే 22న గుండెపోటుతో మరణించారు. అంతకంటే ముందు మే 10న కరోనాతో ప్రముఖ నటుడు, జర్నలిస్ట్ టీఎన్‌ఆర్ తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత సీనియర్ నటి జయంతి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ జూలై 26న చనిపోయారు. ప్రముఖ సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో గత ఏడాది డిసెంబర్ 31న కన్నుమూశారు. ఇలా తోటి కళాకారులు, సినీ ప్రముఖులు వరుసగా మరణిస్తుండటంతో టాలీవుడ్ దిగ్భ్రాంతిలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.