Messi vs CM Revanth : హైదరాబాద్ మహానగరం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనల్ మెస్సీ భాగస్వామ్యంతో కూడిన ఫ్రెండ్లీ మ్యాచ్ డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఓవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండగా, మరోవైపు ఈ ఫుట్‌బాల్ ఈవెంట్ నగరానికి మరింత గ్లోబల్ గుర్తింపును తీసుకురానుంది. ముఖ్యంగా, స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జట్టుకు సారథ్యం వహించనుండటంతో ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుట్‌బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఈ అద్భుతమైన ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రోగ్రాం వివరాల విషయానికి వస్తే, లియోనల్ మెస్సీ డిసెంబర్ 12వ తేదీ రాత్రి కోల్‌కతా చేరుకుంటారు. ఆ తర్వాత, 13వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన 200 మంది సిబ్బంది బృందంతో కలిసి హైదరాబాద్‌కు చేరుకుంటారు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌తో పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈవెంట్లో ప్రధానంగా, వివిధ రంగాల సెలబ్రిటీలతో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇందులో రెండు జట్లు తలపడతాయి – ఒక జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మరో జట్టుకు సాక్షాత్తూ మెస్సీ సారథ్యం వహిస్తారు.
Vijay Deverakonda: విజయ్ అభిమానులకు షాక్.. ‘కింగ్డమ్’ సీక్వెల్‌పై సస్పెన్స్
ఆట తర్వాత, యువ ప్రతిభావంతులను ప్రోత్సహించే ఉద్దేశంతో మెస్సీ మాస్టర్ క్లాస్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఇది యంగ్ ఫుట్బాలర్స్కు ఒక అపురూపమైన అవకాశం. అంతేకాకుండా, పిల్లలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా 25 నిమిషాల పాటు మెస్సీ సాకర్ క్యాంప్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం, స్టేడియంలో పెనాల్టీ షూట్అవుట్ నిర్వహణతో పాటు, చివరిగా ప్రేక్షకులను అలరించేందుకు మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉంటుంది.
ఈ మెస్సీ టూర్ వల్ల ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సాకర్ (ఫుట్‌బాల్) క్రీడ బాగా అభివృద్ధి చెందుతుందని, యంగ్‌స్టర్స్‌కు సాకర్ పట్ల ఆసక్తి పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు ఒక అదనపు విలువగా పరిగణిస్తున్నారు. ఏర్పాట్ల విషయంలో ఎటువంటి లోటు లేకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, భద్రత, వసతులను అడిగి తెలుసుకున్నారు. అభిమానులు నిర్ణీత సమయం కంటే ముందే స్టేడియంలోకి చేరుకోవాలని ఆయన సూచించారు.