Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!

Lemon Pickle

Lemon Pickle

Lemon Pickle: భారతీయ వంటకాల్లో ఊరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ విటమిన్ ‘C’ పుష్కలంగా లభించే నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టపడని వారుండరు. నోటికి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మందికి నిమ్మకాయ పచ్చడి పెట్టిన కొద్ది రోజులకే పాడైపోతుందనే భయం ఉంటుంది. కానీ సరైన కొలతలతో, కొన్ని చిట్కాలు పాటిస్తూ పచ్చడి పెడితే సంవత్సరం పైనే ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది.మరి నిమ్మకాయ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

కావలసిన పదార్థాలు:
* నిమ్మకాయలు: 25 (సుమారు 1 కేజీ)
* ఉప్పు: అర కప్పు (50 గ్రాములు)
* కారం: అర కప్పు కంటే కొంచెం ఎక్కువ (50 – 60 గ్రాములు)
* పసుపు: 1 టీస్పూన్
* మెంతులు: 1 టీస్పూన్
* ఆవాలు: 2 టీస్పూన్లు (పొడి కోసం) + 1 టీస్పూన్ (పోపు కోసం)
* జీలకర్ర: అర టీస్పూన్
* ఇంగువ: అర టీస్పూన్
* నూనె: ముప్పావు కప్పు (200 గ్రాములు – నువ్వుల నూనె లేదా పల్లీల నూనె శ్రేష్ఠం)
* వెల్లుల్లి రెబ్బలు: 12 – 15 (పొట్టు వలిచినవి)
* కరివేపాకు: తగినంత

తయారీ విధానం:
నిమ్మకాయల ఎంపిక:
ముందుగా పచ్చడి కోసం మంచి ముదురు రంగులో ఉండి, పలచని తొక్క ఉన్న తాజా నిమ్మకాయలను ఎంచుకోవాలి. ఇలాంటి వాటిలో రసం ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయలను బాగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఓ 10-15 నిమిషాల పాటు గాలికి ఆరబెట్టాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎక్కడా తడి తగలకూడదు.

ముక్కలు & రసం వేరు చేయడం:
తీసుకున్న 25 నిమ్మకాయలలో మచ్చలు లేని మంచి నిమ్మకాయలను ముక్కల కోసం, మిగిలిన వాటిని రసం కోసం వేరు చేయాలి. ఇక్కడ 13 కాయలను ముక్కల కోసం, 12 కాయలను రసం కోసం వాడుతున్నాం. ముక్కల కోసం నిమ్మకాయలను అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల ముక్కలు త్వరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి. ప్రతి కాయను 4 లేదా 8 ముక్కలుగా కట్ చేసి, అందులోని గింజలను పూర్తిగా తీసేయాలి. రసం కోసం.. రసం పిండాల్సిన కాయలను అడ్డంగా కట్ చేసి, రసాన్ని ఒక గిన్నెలో ఉన్న నిమ్మకాయ ముక్కలపై పూర్తిగా పిండాలి. ముక్కలు రసంలో మునిగేలా ఉంటే ఊట బాగా వస్తుంది.

ఊరబెట్టడం:
ఇప్పుడు ఈ ముక్కలు, రసం ఉన్న గిన్నెలో 1 టీస్పూన్ పసుపు, అర కప్పు (50 గ్రాములు) ఉప్పు వేసి బాగా కలపాలి. నిమ్మకాయల పులుపును బట్టి ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో పోసి మూత పెట్టి, 8 నుండి 10 రోజుల పాటు ఊరబెట్టాలి. రోజు మార్చి రోజు లేదా ప్రతిరోజూ ఒక పొడి చెంచాతో ఈ ముక్కలను పైకి కిందకి కలుపుతూ ఉండాలి. ముక్కలు ఎంత బాగా ఊరితే పచ్చడి అంత రుచిగా ఉంటుంది.

మసాలా పొడి తయారీ:
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టీస్పూన్ మెంతులు వేసి దోరగా వేపాలి. అవి కొద్దిగా వేగాక అర టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్ల ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించి చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.

పోపు వేయడం:
అదే పాన్‌లో ముప్పావు కప్పు (200 గ్రాములు) నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి వేపాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేపడం ముఖ్యం, లేదంటే పచ్చడి బూజు పట్టే అవకాశం ఉంది. చివరగా పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పోపును పూర్తిగా చల్లారనివ్వాలి.

పచ్చడి కలపడం:
బాగా ఊరిన నిమ్మకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో అర కప్పు కంటే కొంచెం ఎక్కువ కారం (50-60 గ్రాములు), మనం తయారు చేసి పెట్టుకున్న ఆవ-మెంతి పొడి వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన పోపును కూడా ఇందులో పోసి బాగా మిక్స్ చేయాలి. అంతే తయారు చేసుకున్న పచ్చడిని వెంటనే తినడం కంటే 1 లేదా 2 రోజుల తర్వాత తింటే ముక్కలకు కారం, పోపు బాగా పట్టి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తడి లేని ఎయిర్ టైట్ గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఏడాది పాటు రంగు, రుచి మారకుండా అద్భుతంగా ఉంటుంది. పచ్చడిని వాడుకునేటప్పుడు పొడి చెంచా మాత్రమే వాడాలి. ఈ పక్కా కొలతలతో మీరు కూడా ఇంట్లోనే ఎంతో సులభంగా నిమ్మకాయ నిల్వ పచ్చడిని తయారు చేసి, దాని కమ్మని రుచిని ఆస్వాదించండి.