కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్‌ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్‌ను సమం చేసిన టీమ్‌ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. బౌలర్లు రాణిస్తున్నా.. టాపార్డర్ నిలకడలేమి టీమ్‌ఇండియాను కలవరపెడుతోంది. ఇషాన్ కిషన్ ప్రతీ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపిస్తుండగా.. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.
ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్ణయాత్మక ఐదో టీ20 జరగబోతోంది. ఒక్క మ్యాచ్ ఓడినా సిరీస్ చేజారే స్థితిలో దృఢంగా నిలబడి వరుసగా రెండు ఘన విజయాలు సాధించడం యువ భారత్ ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచేదే. నాలుగో టీ20లో మరీ 87 పరుగులకే కుప్పకూలడం, 82 పరుగుల తేడాతో ఓడడం సఫారీ జట్టుకు మింగుడు పడని విషయమే. ఉదాసీనతకు తావివ్వకుండా సమష్టిగా చెలరేగితే యువ భారత్ సిరీస్ గెలవడం తేలికే.
భారత్ సిరీస్‌లో పుంజుకోవడానికి ప్రధాన కారణం మిడిలార్డర్. ముఖ్యంగా హార్దిక్ పాండ్య ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ మెరుపులు మెరిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. వీరి నుంచి ఇదే జోరును జట్టు కోరుకుంటోంది. అయితే టాప్‌ఆర్డర్లో నిలకడ లేమి భారత్‌ను కలవరపెడుతోంది. ఇక అందరికంటే పంత్ వైఫల్యం జట్టును ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన అతను.. నిర్లక్ష్యపు షాట్లు ఆడి వెనుదిరుగుతున్నాడు. ఆదివారం వీరంతా నిలకడగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడానికి తోడ్పడాలి. తొలి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన తర్వాత.. బౌలర్లు గొప్పగా పుంజుకుని చక్కటి ప్రదర్శన చేస్తుండడం శుభ పరిణామం. భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఆరంభంలోనే కట్టడి చేస్తున్నాడు. హర్షల్ పటేల్ ప్రతి మ్యాచ్‌లోనూ కీలక వికెట్లు తీస్తున్నాడు. చాహల్ మధ్య ఓవర్లలో అదరగొడుతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో తేలిపోయిన అవేష్ ఖాన్.. నాలుగో టీ20లో నాలుగు వికెట్లు తీసి లెక్క సరి చేశాడు. అక్షర్ ఒక్కడే ఇప్పటిదాకా సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు.
సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను గాయాల బెడద వేధిస్తోంది. రాజ్‌కోట్‌లో కెప్టెన్ బవుమా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అతను బరిలోకి దిగకపోతే కేశవ్ మహరాజ్ జట్టుకు సారథ్యం వహిస్తాడు. అంతకుముందే పేసర్లు రబాడ, పార్నెల్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యారు. మిడిలార్డర్‌లో డుస్సెన్, మిల్లర్, క్లాసెన్ విఫలమవడం దెబ్బతీస్తోంది. ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా అన్ని విభాగాల్లో చెలరేగి భారత్‌ను ఓడించాలనుకుంటోంది. అలాగైతేనే భారత గడ్డపై ఆతిథ్య జట్టుతో సిరీస్ ఓడిపోని రికార్డును కొనసాగించే వీలుంటుంది.
చిన్నస్వామి స్టేడియం భారీ స్కోర్లకు ప్రసిద్ధి. బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఇక్కడ బ్యాటర్లు చెలరేగుతారు. అందుకే సగటు స్కోరు 180గా ఉంటుంది. స్పిన్నర్లు కీలకంగా మారనున్నారు. అయితే మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉంది. వరుణుడు కరుణిస్తే స్టేడియంలో సిక్సర్ల, ఫోర్ల వర్షం కురుస్తుందో చూడాల్సిందే.