రానున్న రోజుల్లో జంట నగరాలుగా కార్మిక (సిరిసిల్ల) , ధార్మిక ( వేములవాడ) క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రి కేటీఆర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, తదితర అంశాలపై మంత్రి కూలంకుషంగా చర్చించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మత్తులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ బ్రిడ్జి కి నిధులు మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణ ప్రగతిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హన్మాజిపేట గ్రామంలో బ్రిడ్జి నిర్మించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అన్నారు. వేములవాడలో ప్రగతిలో ఉన్న రెండో బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడలోని తిప్పాపూర్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు.