వరి కుప్పల పై రైతుల చావులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్‌పై, బీజేపీ పైనా తీవ్ర విమర్శలను గుప్పించారు. వరి ధాన్యం కుప్పలపై రైతులు చనిపోవడంపై స్పందిస్తూ.. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలన్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని అపాయింట్‌మెంట్ లెటర్ చూపెట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడతున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. బీజేపీని ఉద్దేశిస్తూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు తినేది అన్నమే కదా..? బండి సంజయ్, కిషన్‌రెడ్డి పశువుల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ఓ వైపు రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా చస్తుంటే .. మీరు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడతారా..? సిగ్గు తప్పిన కొడుకుల్లారా ..? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు చస్తుంటే ..మీరు రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. రైతులు మద్దతు ధర అడగటం తప్పా..? రైతులు ఇబ్బందుల్లో ఉంటే మీకు 80 సీట్లు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై రాజకీయాలు మాని రైతుల సమస్యలపై పోరాడటానికి పార్టీలకతీతంగా కలిసి రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.