ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం వెలుపల పేలుడు సంభవించడంతో ఇద్దరు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విధంగా గురుద్వారా కాంప్లెక్స్ లో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గురుద్వారాకు అనుబంధంగా ఉన్న కొన్ని దుకాణాలు ధ్వంసం అయ్యాయి.
శనివారం ఉదయం గురుద్వారాలో ప్రార్థనలు చేయడానికి 25-30 మంది ఆఫ్ఘన్ హిందువుల, సిక్కులు ప్రార్థనా మందిరానికి వచ్చారు. ఇదే సమయంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దాడి నుంచి 10-15 మంది తప్పించుకోగా.. మిగిలిన వారు గురుద్వారాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గురు గ్రంథ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలోని ప్రధాన దర్బార్ హాలు మంటల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో కూడా ఆఫ్ఘన్ లో సిక్కులు, హిందువులు టార్గెట్ గా చేసిన దాడిలో చాలా మంది మరణించారు మార్చి 25, 2020లో కాబుల్ లోని గురుద్వారా గురు హర్ రాయ్ సాహిబ్ వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది సిక్కులు మరణించారు. 2018లో జలాలాబాద్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో సిక్కు మాజీ ఎంపీ నరీందర్ సింగ్ ఖల్సా తండ్రి అవతార్ సింగ్ ఖల్సాతో సహా 19 మంది సిక్కులు, హిందువులు మరణించారు. దాడిని భారత విదేశాంత మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.
అయితే ఈ దాడికి ఐసిస్ కురాసన్ కారణం కావచ్చని తాలిబన్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరసగా మైనారిటీలు లక్ష్యంగా ఐసిస్ దాడులకు తెగబడుతోంది. షియా, హజారా వర్గాలపై దాడులు చేస్తోంది. తాజాగా హిందూ, సిక్కులపై దాడి చేసింది.