ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం సిక్కులను, హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడి చేశారు. కాబూల్ లోని బాగ్-ఇ బాలా ప్రాంతంలో గురుద్వారా కార్తే పర్వాన్ లక్ష్యంగా ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఈ దాడిలో ఒక సిక్కుతో పాటు ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గుర్ని అక్కడి భద్రతాబలగాలు హతమార్చాయి. గురుద్వారాలో శనివారం ఉదయం 30 మంది వరకు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్స్ తో విరుచుకుపడ్డారు. గ్రెనెడ్ విసరడంతో గురుద్వారాలో మంటలు చెరేగాయి.
అయితే ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచినందుకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు ఉగ్రవాదులు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఆప్ఘనిస్తాన్ లో పాలనను తాలిబన్లు చేజిక్కించుకున్న తరువాత నుంచి అక్కడ షియా, హజారా, సిక్కు మైనారిటీలు టార్గెట్ గా ఐఎస్ఐఎస్ దాడులకు పాల్పడుతోంది. ఇదిలా ఉంటే ఈ దాడిని ప్రధాన మంత్రి మోదీ ఖండించారు. ‘‘కాబూల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై జరిగిన పిరికిపంద ఉగ్రదాడితో దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను ఈ అనాగరిక దాడిని ఖండిస్తున్నాను, భక్తుల భద్రత మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ లోని సిక్కులు, హిందువుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిన్న జరిగిన ఉగ్రదాడిని నిశితంగా గమనిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుపోయిన సుమారు 100 మంది సిక్కులు, హిందువులకు ఈ-వీసాలు జారీ చేసింది. దీంతో వారంతా భారత్ రావడానికి మార్గం సుగమం అయింది.
గతంలో 2020లో కూడా ఆఫ్ఘన్ లో సిక్కులను లక్ష్యంగా చేసుకుంటూ ఉగ్రదాడి జరిగింది. కాబూల్ నగరంలోని ప్రముఖ గురుద్వారా అయిన హర్ రాయ్ సాహిబ్ పై భారీ సాయుధ ఆత్మాహుతి బాంబర్ దాడి చేయడంతో 25 మంది మరణించారు.