ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద కళాకారులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నటుడు అప్పారావు మాట్లాడుతూ… చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది: మంత్రి కొడాలి నాని
1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు ఈ నాటకాన్ని రాశారని.. మొదటిసారి ఆ నాటకంలో కాళ్ళకూరి నారాయణ రావు గారు నటించారని అప్పారావు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాధాకరమని.. ఈ ప్రభుత్వం సంఘీ భావంతో కూడిన మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. కళాకారులను, కళలను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాను ఆకాంక్షిస్తున్నానని అప్పారావు ఆశాభావం వ్యక్తం చేశారు.