ప్రపంచ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ ఇంకో రెండు నెలల్లో మొదలు కానుంది. ఐపీఎల్ 15వ సీజన్‌ను ఈ ఏడాది కాస్త ముందుగానే.. అంటే మార్చి నెలాఖరులోనే ప్రారంభించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించారు. స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని… కరోనా కేసులు అదుపులోకి రాని పక్షంలో లీగ్‌ను మరోసారి విదేశానికి తరలించక తప్పదన్నారు. భారత్‌లోనే లీగ్ జరగాలని అన్ని ఫ్రాంచైజీల యజమానులు కోరుకుంటున్నారని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.
Read Also: అండర్-19 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన యువ భారత్
ఒకవేళ భారత్‌లోనే ఐపీఎల్ జరిగినా అన్ని ఫ్రాంచైజీల సొంత నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాదని బీసీసీఐ భావిస్తోంది. ముంబై, పూణే నగరాల్లో పలు మైదానాలు ఉన్నందున… విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా కొత్త సీజన్‌లో పోటీలు ఆ రెండు నగరాల్లో నిర్వహించే వీలుందని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. కాగా గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐపీఎల్ లాంటి మెగా లీగ్‌ను భారత్‌లో నిర్వహించడం వీలు కాకపోతే దక్షిణాఫ్రికాను ప్రత్యామ్నాయ వేదికగా బీసీసీఐ ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.