IndiGo Crisis: ఆరు రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికుల్ని తీవ్రంగా గందరగోళానికి గురి చేసింది. డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ నిర్వహణ లోపం, మారిన నిబంధనలకు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇండిగో గందరగోళం చెలరేగింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైనర్, మార్కెట్లో మెజారిటీ షేర్ కలిగిన ఇండిగో కావాలనే ఇలా తన వ్యవస్థల్ని కుప్పకూల్చిందని సాధారణ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇండిగో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీసీఏ ఇండిగోకు నోటీసులు జారీ చేసింది. భారీ చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌తో నిన్న కేంద్రం విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండిగోను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, తమ కార్యకలాపాలను స్థిరీకరిస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఎయిర్ లైన్ తన నెట్‌వర్క్‌లో 95 శాతం సర్వీసుల్ని పునరుద్ధరించినట్లు చెప్పింది. శనివారం 700 నుంచి ఆదివారం సాయంత్రం నాటికి విమానాల సంఖ్య 1500కు పెరిగుతుందని తెలిపింది. ఈ సంక్షోభంపై ఇండిగో తన కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 135 స్థానాలకు సర్వీసుల్ని పునరుద్ధరించింది. మరోవైపు, ఇండిగో వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇండిగో సంక్షోభం ‘‘నియంతృత్వానికి’’ ఉదాహరణగా అభివర్ణించారు. మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ.. ఈ గందరగోళానికి డీజీసీఏ, విమానమంత్రిత్వ శాఖను నిందించారు.