ఇండియాలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. అయితే గతంలో పోలిస్తే మరణాలు బాగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,270 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. కరోనా కారణంగా 31 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,859గా నమోదైంది. గత 24 గంటల్లో 4,32,389 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… కొత్తగా 1,270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
గతంతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఆదివారం వివరాల ప్రకారం రోజు 149 మంది కరోనా కారణంగా మృతి చెందగా… గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి 1,567 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,859గా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు 183 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న ఒక్క రోజే 4,20,842 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,83,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు కేంద్రం కరోనా కాలర్ ట్యూన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్‌లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా కరోనా వ్యాక్సినేషన్, కరోనా జాగ్రత్తలు గురించి వివరిస్తూ అవతలి వ్యక్తికి ఏదైనా అత్యవసర సమాచారం ఇవ్వాల్సి వస్తే ఆలస్యం అవుతోంది. దీంతో కాలర్ ట్యూన్లు త్వరలో నిలిపివేయనున్నాయి సెల్ ఫోన్ కంపెనీలు.