భారత్‌లో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 102 నుంచి 142కి పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021 నాటికి భారత్‌లో 142 మంది బిలియనీర్లు ఉండగా… వీరి దగ్గర ఉన్న ఉమ్మడి సంపద విలువ 719 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీలో 53 లక్షల కోట్లు అన్నమాట. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో… 98 మంది సంపన్నుల దగ్గర సుమారు అంతే సంపద (రూ.49 లక్షల కోట్లు) ఉందని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది.
Read Also: నక్క తోక తొక్కిన పెయింటర్.. లాటరీలో రూ.12 కోట్ల జాక్‌పాట్
భారత్‌లోని టాప్-10 ధనవంతుల దగ్గర ఉన్న సంపదతో దేశంలోని పిల్లలందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్ల పాటు ఉచితంగా అందించొచ్చని ఆక్స్‌ఫామ్ నివేదిక అభిప్రాయపడింది. అటు భారత్‌లోని టాప్ 98 మంది ధనవంతుల వద్ద ఉన్న డబ్బుతో ఆయుష్మాన్ భారత్ (ఆరోగ్యశ్రీ తరహా) పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చని తెలిపింది. దేశంలోని 10 మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా వారి సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ నివేదిక అంచనా వేసింది. కాగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ వేదికగా ఈరోజు జరగనుంది. వర్చువల్‌గా జరిగే ఈ సదస్సులో ఆక్స్‌ఫామ్ తాజా సర్వే వివరాలను వెల్లడించనుంది. ఈ సదస్సును ఉద్దేశించి రాత్రి 8:30 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.