ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా మహిళల ప్రపంచకప్ జరుగుతోంది. అయితే పురుషుల ప్రపంచకప్ ప్రైజ్ మనీతో పోలిస్తే మహిళల ప్రపంచకప్ ప్రైజ్ మనీ తక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల, మహిళ ప్రపంచకప్ టోర్నీల ప్రైజ్ మనీల మధ్య సమానత్వం తీసుకొచ్చేందుకు ఐసీసీ అడుగులు వేస్తోంది. రాబోయే 8 ఏళ్లలో మహిళల క్రికెట్ ఈవెంట్లకు సంబంధించి జరిగే చర్చల్లో దీనిపై మరింత చర్చిస్తామని ఐసీసీ సీఈవో జియోఫ్ అలార్‌డైస్ అన్నారు.
కాగా 2019లో జరిగిన పురుషుల ప్రపంచకప్ విన్నర్ ప్రైజ్‌మనీ 4 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం జరుగుతున్న 2022 మహిళల ప్రపంచకప్ ప్రైజ్ మనీ 1.32 మిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో ఐసీసీపై విమర్శలు వస్తుండటంతో ఈ విషయంపై ఐసీసీ తాజాగా స్పందించింది. కాగా మహిళల ప్రపంచకప్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మార్చి 30న తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడనున్నాయి. మార్చి 31న రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.