ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్‌లోనే అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా జట్టు విజయాల గురించి కెప్టెన్ హార్డిక్ పాండ్యా స్పందించాడు. జట్టులో ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే హెచ్చుతగ్గులు లేకపోవడమే తమ విజయాలకు కారణమన్నాడు. తాను కెప్టెన్ అయినా జట్టులోని మిగతా ఆటగాళ్లు తక్కువ అన్న ఫీలింగ్స్ ఏం లేవన్నాడు. వ్యక్తిగా ఎదగడం కంటే జట్టుగా ఎదగడాన్నే తాను ఇష్టపడతానని క్లారిటీ ఇచ్చాడు.
వన్ ఫర్ ఆల్.. ఆల్ ఫర్ వన్ అనే నినాదాన్ని తమ జట్టు అనుసరిస్తుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా వివరించాడు. జట్టులోని ప్రతి ఆటగాడు కెప్టెన్ తరహాలో ఆలోచించి తమను తాము కీలకంగా భావిస్తున్నారని.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపాడు. మంచి ఫలితాలు వస్తుండటంతో తమ ఆటగాళ్ల నుంచి ఇంకా ఎక్కువ కోరుకోవడం లేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. ముఖ్యంగా ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్ వంటి దిగ్గజాలు కోచింగ్ అందిస్తుండటంతో ఆ జట్టు వరుస విజయాలను సాధిస్తోంది.