అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్‌లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు.
ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ కాసేపు మీడియాతో మాట్లాడాడు. క్రీడల్లో భారత్ తరఫున మరింత మేర ప్రాధాన్యం పెరగాల్సి ఉందని.. ఆ దిశగా తాను కృషి చేస్తానని హర్భజన్ స్పష్టం చేశాడు. భారత్‌లోని యువతకు చాలా సత్తా ఉందని.. వారి సత్తాకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. మన దేశంలోని యువకులు ఒలింపిక్స్‌లో 200 పతకాలను గెలిపించగల సత్తా కలిగి ఉన్నారని తాను విశ్వసిస్తున్నట్లు భజ్జీ తెలిపాడు.