టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుతూనే ఉంది. ఇటీవల కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే విషయం చర్చకు రావడంతో బీజేపీ విమర్శలకు దిగింది. అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలనంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రధాని కావాలని అందరికీ కోరిక ఉంటుందని, 2024లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాన మంత్రి అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ జాతీయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో బీజేపీపై అటాక్ చేస్తోంది. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంశాన్ని లేవనెత్తుతోంది టీఆర్ఎస్. మతాల పేరుతో దేశంలో బీజేపీ చిచ్చు పెడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కూడా బీజేపీ పార్టీపై ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక హుస్సెని పురలో మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీపై పలు వ్యాఖ్యలు చేశారు. దేవుడు ఉన్న చోట దయ్యాలు ఉన్నట్లు..మొదటి రోజు మీ యాత్రలో దేశంలోని దెయ్యాలని రాళ్లతో కొట్టాలని అన్నారు. దేశంలో బీజేపీ శ్రేణులు దయ్యాలుగా మారాయని ఆయన విమర్శించార. వారిని కూడా ఇలాగే బుద్ధి చెప్పాలని అన్నారు. రాక్షసులను తరిమిపంపే శక్తిని ఇవ్వాలని అల్లాను కోరుకోండని సూచించారు.
ఒక వ్యక్తి వ్యాఖ్యల వల్ల దేశం, ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిందని.. అరబ్ దేశాల నుంచి వ్యతిరేఖత వచ్చిందని.. అలాంటి పరిస్థితులు రావడం మంచిది కాదని ఆయన అన్నారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే వారి పట్ల సంయమనంతో ఉండాలని అన్నారు.