తెలంగాణలో వాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. జూన్‌లో పెద్దెత్తున వాక్సినేషన్ జరిగినా, ఒక్కసారిగా ఢీలా పడింది. మొదటి డోస్ వేసుకున్నోళ్లకు రెండో డోస్ ఇప్పుడు దొరకడం లేదు. ఇక ఫస్ట్ డోస్ వేసుకుందామనుకున్నవారికి అదికూడా దక్కడం లేదు. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో జనం వెతుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందికీ వాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు హైరిస్క్‌లో ఉన్న వాళ్ళకు మాత్రమే వాక్సిన్ వేయగా అర్హులందరికీ టీకా ఇస్తున్నారు.. ప్రభుత్వ సెంటర్లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీకా ఇస్తున్నారు. అయితే సరిపడా డోసులు లేకపోవడంతో కొందరికి మాత్రమే అందుతున్నాయి. కేంద్రం నుంచి మూడు నాలుగు రోజులకొకసారి లక్ష నుంచి మూడు లక్షల దాకా డోసులు వస్తున్నాయి.
ఇటు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో మార్పులు ఎక్కువగా చేస్తున్నారు. మరోపక్క కోవీషీల్డ్ రెండో డోస్ కోసం గతంలో 12 వారాల నుంచి 16 వారాల గడువు ఉండగా, ఇపుడు 14 నుంచి 16 వారాలుగా మార్చారు. హైదరాబాద్‌లోనే దాదాపు వంద వాక్సిన్ సెంటర్లున్నాయి. అయితే, కావాల్సిన బ్రాండ్ మాత్రం అందుబాటులో ఉండడం లేదు. తెలంగాణాలో ఇప్పటి వరకు కోటి మందికిపైగా వేయించుకున్నారు. అయితే రెండో డోస్ వేయించుకోవాల్సిన వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. దాదాపు 50 లక్షల మంది సెకెండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రభుత్వం వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఏ సెంటర్లో దొరుకుతుందనేది మాత్రం కష్టంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన డోసులు మరింత పెరిగితే ఈ కష్టాలకు ఫుల్‌స్టాప్ పడుతుంది.