భారత్ తో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా బుధవారం ఒక్క రోజే ఇండియాలో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి దాదాపుగా 3 నెలల తరువాత గరిష్ట స్థాయికి కేసుల సంఖ్య చేరుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి. ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.
తాజాగా ఢిల్లీలో గురువారం కొత్తగగా 622 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.17 శాతానికి పెరిగింది. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 19,10,613కి చేరుకోగా, మృతుల సంఖ్య 26,216కి చేరింది. మరోవైపు మహారాష్ట్రలో కూడా కేసుల సంఖ్య పెరిగింది. గురువారం 2,813 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు నాలుగు నెలల కాలంలో మహారాష్ట్రలో ఇదే అత్యధికం. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,571కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 1,702 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వరసగా మూడో రోజు కూడా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వందను దాటింది. తాజాగా గురువారం రాష్ట్రంలో 122 కేసులు నమోదు అయ్యాయి.
అయితే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కరోనా ఫోర్త్ వేవ్ కు కారణం అవుతుందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీకి చెందిన డాక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ.. దేశం మరో తరంగాన్ని చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పెరుగుతున్న కేసులపై కేంద్ర ప్రభుత్వ ఆయా రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. కరోనా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పద్ధతులు అవలంభించాలని కోరారు.