దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఫోర్త్ వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ఫిబ్రవరి నుంచి దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు లోపే నమోదు అయ్యేది. తాజాగా గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. రోజూవారీ కేసులు 7 వేలు, 8 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీల్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 12,213 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న నమోదైన 8,822 కేసులతో పోలిస్తే 38.4 శాతం కేసులు పెరిగాయి. ఫిబ్రవరి 26 తరువాత ఒక్క రోజులో వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 10 వేలను దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7,624 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 11 మంది వైరస్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,26,74,712కు చేరుకుంది. మరణాల సంఖ్య 5,24,803కు చేరుకుంది. డైలీ పాజిటివిటీ రేటు 2.35కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 1,375 కొత్త కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 7.01 శాతానికి పెరిగింది. ఢిల్లీలో వరసగా మూడు రోజుల నుంచి 1100 కన్నా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం 4,024 కేసులు నమోదు అయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే దాదాపుగా 36 శాతం కేసులు పెరిగాయి. ఫిబ్రవరి 12 తరువాత ఇదే అత్యధికం. ముంబై లోనే 2,293 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 195 కోట్ల డోసులు ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 15,21,942 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు.