సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ వేదికగా మండిపడింది. ఆ వీరుడి అంతిమ యాత్రలో ఉండాల్సింది, భారత త్రివర్ణ పతాకమని.. ఫాసిస్టు పింకు జండాలు కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్ విద్యార్థి చావు ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాబందులు శవాల మీద వాలి పీక్కు తినడం తెరాస నాయకులను చూసే నేర్చుకున్నాయేమో అని అనిపిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
మరోవైపు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నరని.. ఎంపీలు దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్ళి ఆ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ కూడా డ్రామాలు ఆపాలన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరు ప్రజా కంటకులే అని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అన్నివిధాలా ఆలోచించి, చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్ సర్వీసును కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందన్నారు. సైనికులను నాలుగేళ్ల ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సైన్యంలో చేరికలను ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అందులో భాగమే నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటన అని చెప్పారు.
ఆ వీరుడి అంతిమ యాత్రలో ఉండాల్సింది, భారత త్రివర్ణ పతాకం రా రాబందులారా! మీ ఫ్యాసిస్టు పింకు జండాలు కాదు!
రాబందులు శవాల మీద వాలి పీక్కు తినడం తెరాస నాయకులను చూసే నేర్చుకున్నాయేమో అని అనిపిస్తుంది. pic.twitter.com/GdNasg9fhf
— Telangana Congress (@INCTelangana) June 18, 2022