34 ఏళ్ల నాటి రోడ్డు రేస్ కేసులో పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ నేత నవ్యజోత్ సింగ్ సిద్దూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ మేరకు ఆయన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేరారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో సిద్ధూను పాటియాలా జైలు నుంచి భారీ భద్రతతో పీజీఐఎంఈఆర్‌కి పోలీసులు తరలించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హెపటాలజీ విభాగంలో సిద్దూ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
1988లో జరిగిన రోడ్డుప్రమాదం కేసులో నవ్యజోత్ సింగ్ సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించడంతో ఆయన స్థానిక కోర్టులో లొంగిపోయారు. దీంతో మే 20 నుంచి పాటియాలా సెంట్రల్ జైలులో సిద్దూ శిక్షను అనుభవిస్తున్నారు. అక్కడ సిద్దూ మున్షీగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సిద్దూ మున్షీగా వర్క్ చేస్తున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. కాగా రెండు వారాల క్రితం సిద్ధూను వైద్య పరీక్షల నిమిత్తం పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.