అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం అయింది. తరోన్ ని ఎట్టకేలకు చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ళ బాలుడు తరోన్ ఈ నెల 19 నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించాయి.
అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందించారు. సరిహద్దు ప్రాంతంలో మూలికల అన్వేషణ కోసం వెళ్లిన తరోన్ ను చైనా బలగాలు అపహరించాయని, మిగతావారు తప్పించుకున్నారని తెలిపారు. ఈ ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత తరోన్ తమ అధీనంలో ఉన్నాడంటూ భారత సైన్యానికి చైనా బలగాలు సమాచారం ఇవ్వడంతో అతడిని విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
విదేశాంగ శాఖ అధికారులు చైనా బలగాలతో పలుమార్లు సంప్రదింపులు జరపడంతో తరోన్ విడుదలపై ఆశలు పెరిగాయి. ఎట్టకేలకు చైనా అధికారులు స్పందించి అరుణాచల్ ప్రదేశ్ లోని వాచా-దమై ప్రాంతాల మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద చైనా తరోన్ ను భారత సైన్యానికి అప్పగించింది. తరోన్ అప్పగింతను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎంతో సామరస్యపూర్వకంగా, నేర్పుగా వ్యవహరించి బాలుడి విడుదలకు కృషి చేశారంటూ భారత సైన్యాన్ని మంత్రి అభినందించారు. తరోన్ కు వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తారు.