విశాఖ జిల్లాలో పసిపాప కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. టెక్నాలజీ సాయంతో పాపను కిడ్నాప్ చేసిన ముఠా గుట్టురట్టుచేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిన్నారిని రక్షించారు. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిన్న 8 గంటలకు కెజిహెచ్ పాప కిడ్నాప్ అయ్యిందని సమాచారం వచ్చింది. నిన్న అన్ని చోట్ల పోలీసుల గాలించారు. మన ఇల్లు మన బాధ్యత ప్రోగ్రామ్ ద్వారా షాపుల్లో అపార్ట్‌మెంట్ లో సీసీ కెమెరాలు పెట్టమని కోరాం.
చాలా మంది సీసీ కెమేరాలు పెట్టారు. బిడ్డను కిడ్నాప్ చేసిన మహిళల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పరిశీలించి కొంత సమాచారం సేకరించాం అన్నారు సీపీ. కేజీహెచ్ లో ఆ మహిళ బిడ్డను తీసుకుని ఆటోలో గురుద్వార్ వైపు వెళ్ళింది. అక్కడ సీసీ కెమేరాలో లభించిన దృశ్యాలు క్లియర్ గా లేవు. అక్కడ ఉన్న షాపు సీసీ కెమెరాలో క్లియర్ గా బిడ్డను తీసుకెళ్ళిన మహిళల దృశ్యాలు కనబడ్డాయి. దీంతో త్వరగా కేసు ట్రేస్ చేసాం. గురుద్వార్ నుండి ఓ క్యాబ్ లో వారు శ్రీకాకుళం పయనం అయ్యారు.
దానిని ట్రేస్ చేసి పట్టుకున్నాం. సీసీ కెమేరాలు ప్రతి ఒక్కరు అమర్చుకోవాలి. దాని వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. గాయత్రి,గీత,యశోద, పిల్లలు లేని రాజేష్ లక్ష్మీకి పిల్లలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం కేజీహెచ్ వచ్చారు. అక్కడ కొండమ్మ సహకారంతో యశోద పిల్లని తీసుకుని గురుద్వార్ వెళ్ళి రాజేష్ కు అప్పచెప్పింది.
పిల్లని అమ్మేందుకు వీరు 20 వేలు తీసుకున్నారు. యశోద నర్సులా కనబడం వల్ల తల్లి అప్పాయమ్మ బిడ్డను యశోదకు అప్పగించింది. కొండమ్మ విశాఖ జిల్లా జి మాడుగులకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. కొండమ్మతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొండమ్మ 5 వ బిడ్డ డెలివరీ కోసం కేజీహెచ్ కు వచ్చింది. కొండమ్మకు మగ బిడ్డ పుడితే ఇవ్వనంది ఆడపిల్ల పుడితే ఇస్తానంది. కాని కొండమ్మ కు పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఈ బిడ్డను తీసుకువెళ్ళారు. కేజీహెచ్ సెక్యూరిటీ సిబ్బంది పై విచారిస్తున్నాం. మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. దాని పై విచారణ చేస్తున్నామన్నారు మనీష్ కుమార్ సిన్హా.