దేశంలో ఇటీవల భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. చాలా జంటలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే పెటాకులు అవుతున్నాయి. తాజాగా ఓ విడాకుల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి శారీరక బంధాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమే అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో హైకోర్టులో విచారణకు వచ్చిన ఓ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
తనతో తన భార్య కలిసి ఉండటం లేదని.. శృంగారానికి నిరాకరిస్తోందని.. దీంతో తనకు విడాకులు కావాలని ఓ భర్త ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సదరు భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసింది. భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం ఆరోగ్యకరమైన వైవాహిక జీవితంలో ముఖ్యమైన విషయాలలో ఒకటి అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. కాగా భార్య అనుమతి లేకుండా శృంగారం చేయడం కూడా తప్పేనని గతంలో పలు న్యాయస్థానాలు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.