ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం అధినేత, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడారు. శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెబుతుంటే, సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా కనికరించని పరిస్థితుల్లో వైసీపీ ఉందన్నారు. తోటి వారిని ప్రేమించాలనే బైబిల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దాడుల్ని యేసు ప్రభువు ఆమోదిస్తారా? ఉన్నత ప్రమాణాలు పాటించే క్రైస్తవ విద్యా సంస్థలకు గ్రాంట్ నిలిపేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ హయాంలో కట్టిన ఇళ్ళకు ఇప్పుడు బలవంతపు వసూళ్లు చేయడం సరైంది కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలకు శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీనేనని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడుతామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. చర్చిలకు తొలిసారి ఆర్థిక సాయం చేయటంతో పాటు పెళ్లి కానుక, జెరూసలేం యాత్రకు నిధులు, క్రిస్మస్ కానుక లాంటి ఎన్నో పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేసి క్రైస్తవులకు అండగా నిలిచిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.