ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. టీడీపీ సమస్యలని ప్రస్తావిస్తే.. వైసీపీ బూతులు తిడుతుంది. బూతులు తిట్టడం నాకు రాదు. ప్రత్యర్ధులు బూతులు తిడితే టీడీపీ కూడా తిట్టాల్సిన అవసరం లేదు.సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన లక్ష్యంగా పని చేయాలని టీడీపీ కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేశారు.నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్లకే జగన్ అండగా ఉంటున్నారు. వివేకా హత్య రక్తపు మరకలు టీడీపీకి అంటిస్తున్నారు.గొడ్డలిపోటుతో వివేకా చనిపోతే.. గుండెపోటు అని అబద్దాలు చెప్పారు. సీబీఐ ఎంక్వైరీ కావాలని ఇద్దరు చెల్లెళ్లను పక్కన పెట్టుకుని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరైన జగనన్న బాణం తెలంగాణలో తిరుగుతోంది. వైఎస్ వివేకాను చంపారని మరో చెల్లెలపై వైసీపీ ఆరోపణలు చేస్తున్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డే వివేకా హత్యను దాచిపెట్టే ప్రయత్నం చేశారని స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ శంకరయ్య సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని రావణాసుర కాష్టంగా మార్చారు. ముద్దాయే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీపై కేసులు పెట్టారంటే.. ఎంతగా బరితెగించారో అర్ధం అవుతోంది. వైఎస్ వివేకా హత్య విషయంలో సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా..? చనిపోయిన వ్యక్తి వివేకా క్యారెక్టరును చిన్నబుచ్చే రకంగా వ్యవహరిస్తున్నారు.
అబద్దాన్ని అతికినట్టుగా చెప్పి జగన్ రాజకీయ లబ్ది పొందారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. వెంకన్నను అపవిత్రం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తూ సేవా టిక్కెట్ల ధరలు పెంచేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు.భక్తులను వెంకన్నకు దూరం చేయాలనుకుంటున్నారా..? వెంకన్న పవరును తగ్గించాలని చూస్తున్నారా..?అని ప్రశ్నించారు చంద్రబాబు.
వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. మూడేళ్లైనా అతీగతీ లేదు. ఉద్యోగుల జీతాలు తగ్గించేశారు. పోలవరాన్ని 45.72 అడుగుల మేర నిర్మించాలి.. అప్పుడే నదుల అనుసంధానానికి వీలు ఉంటుంది. పోలవరాన్ని 45.72 అడుగుల మేర నిర్మాణం చేయగలిగితేనే రాయలసీమకు నీటిని అందివ్వగలం. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తామంటున్నారు. పోలవరం ప్రాజెక్టును కాస్త.. బ్యారేజీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉందన్నారు చంద్రబాబు.