ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తినను తాకింది.. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఆయన.. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను ఏకరువు పెట్టింది.. నాలుగు ప్రధాన అంశాలను ప్రెసిడెంట్ ముందు పెట్టారు.. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేసింది చంద్రబాబు టీమ్.. లిక్కర్, డ్రగ్స్, మైనింగ్, సాండ్ మాఫియా విస్తరించిందని.. న్యాయ, మీడియాతో సహా అన్ని వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, ఏపీలో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని, అక్టోబర్ 19న జరిగిన ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని, అధికారపార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీని రీకాల్ చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు మీడియాకు వివరించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, తన ఫిర్యాదుపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
Read Also: విద్యార్థుల బస్ పాస్ కష్టాలకు చెక్.. ఇక ఆన్‌లైన్‌లో రెన్యూవల్ ..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి వివరించామని.. ఏజెన్సీ ప్రాంతంలో 25 వేల ఎకరాల్లో 8 వేల కోట్ల రూపాయల గంజాయి సాగు అవుతుందని, ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుకున్నా.. ఆంధ్రప్రదేశ్ తో దానికి సంబంధం ఉందని ఈ సందర్భంగా తెలిపారు చంద్రబాబు.. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి డ్రగ్స్ సరఫరా, ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయన్న ఆయన.. మద్యపాన నిషేధం అంటూ, తక్కువ నాణ్యత గల మద్యం అమ్ముతున్నారని.. డ్రగ్స్, గంజాయి అమ్మకాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రం వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉండేది. కానీ, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉందని విమర్శించిన టీడీపీ అధినేత.. పోలీసుల సహకారంతో మా పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులు జరిగాయని మండిపడ్డారు.. కొద్ది రోజులుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.. రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి.. ప్రత్యేక జీవో ద్వారా మీడియాపై దాడులు జరుగుతున్నాయి.. ప్రలోభాలు, దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని.. 41 ఏ ద్వారా అరెస్ట్ లు చేస్తున్నారని తెలిపారు.
మానసికంగా ప్రతిపక్ష నేతల పై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు చంద్రబాబు.. చివరికి పార్లమెంటు సభ్యులపై కూడా పోలీసులు చేయి చేసుకుంటున్నారన్న ఆయన.. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవంటూ మండిపడ్డారు. కనీసం, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతుంది.. కేసులతో వేధింపులు పెరిగిపోతున్నాయి.. రాష్ట్రప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పోలీసులు కూడా భాగస్వాములు అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో రాజ్యాంగం లోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరామన్న చంద్రబాబు.. సీబీఐ చేత దర్యాప్తు జరపాలని కోరామని వెల్లడించారు.. ఇక, చంద్రబాబు, టీడీపీ ఫిర్యాదుపై రామ్‌నాథ్ కోవింద్ సానుకూలంగా స్పందించనట్టు నేతలు చెబుతున్నారు.. టీడీపీ నేతలు చెప్పిన అంశాలన్నీ చాలా సీరియస్ అంశాలని.. వీటన్నింటినీ పరిశీలనకు తీసుకుంటామని ఆయన రియాక్ట్ అయినట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నమాట. ఇక, అమరావతి అంశంపై కూడా ఈ భేటీలో చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.