టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు.. ఆయా ఘటనల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ఏపీ గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేటుపై వివరాలను చంద్రబాబు వివరించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఆయా ఘటనల్లో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. జంగిల్ రాజ్ జగన్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని విమర్శలు చేశారు. వైసీపీ నేతల ఆగడాలు శ్రుతిమించుతున్నాయని.. వాళ్లను అదుపు చేయడంలో పోలీసులు అశ్రద్ధ వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగి ఉండేది కాదన్నారు. ఏపీలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి విక్రయిస్తున్నారని.. తద్వారా నేరాలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీస్ శాఖ దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు.