అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యల అంశంపై ఆయన చర్చించారు. మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తల్లికి పింఛన్ ఇవ్వలేదని ప్రశ్నించిన కుమారుడిపై పోలీసుల దాడిని టీడీపీ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని ఆరోపించారు. అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏపీలో 31 అత్యాచార, దాడుల ఘటనలు జరిగినట్లు చంద్రబాబు వివరించారు. గత నెలలో 26 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాక ఉపాధి లేక యువత వలస వెళ్లిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ నేత కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతల దాడి అమానవీయమన్నారు. శ్రీకాళహస్తిలో నామినేషన్‌కు వెళ్తున్న టీడీపీ నేత చలపతినాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడటం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు చంద్రబాబు వరుసగా జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. మహానాడులోగా వీలైనన్ని జిల్లాలలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈనెల 4, 5 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఈనెల 4న స్పీకర్ తమ్మినేని నియోజకవర్గం ఆముదాలవలసలో పర్యటించనున్నారు. 5న గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం భీమిలిలో పర్యటించాలని భావిస్తున్నారు.
Chandra Babu: డీజీపీకి లేఖ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలి