సెంట్రల్ విస్టా పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ చేపట్టింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో 13 ఎకరాల స్థలంలో పార్లమెంట్ భవనాల నిర్మాణం జరుగుతోంది. 2020 డిసెంబరులో ఈ భవనాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ.977 కోట్లుగా ఉంది. అయితే ఏడాది గడిచే లోపే బడ్జెట్ భారీగా పెరిగింది. ఏకంగా 29 శాతం పెరుగుదలతో రూ. 282 కోట్ల మేర పెరిగి.. ప్రస్తుతం రూ.1,249 కోట్లకు చేరుకుంది.
Read Also: గిన్నిస్ రికార్డు: 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి
సెంట్రల్ విస్టా పనులు ఇప్పటి వరకు 40 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయానికల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముందుగా టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం డెడ్ లైన్‌ను అక్టోబర్‌కు పొడిగించారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు సెంట్రల్ విస్టా నిర్మాణానికి అడ్డురాని విధంగా పనులు జరుగుతున్నాయి. ఇది జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టు కావడంతో పనులకు ఆటంకం కలగకుండా చూడాల్సి ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పార్లమెంటు నిర్మాణ పనులకు కోవిడ్ ఆంక్షలు వర్తించవని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.