ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది. మరోవైపు బడ్జెట్‌ను చూడాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపిందించింది. ఈ యూనియన్ బడ్జెట్ యాప్ ద్వారా బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బడ్జెట్ కాపీల ముద్రణను తగ్గించింది. దీంతో బడ్జెట్ ప్రక్రియ డిజిటల్ రూపంలోకి క్రమంగా మారిపోవడం ప్రారంభమైంది. తొలుత జర్నలిస్టులకు, బయటి విశ్లేషకులకు పంపిణీ చేసే ప్రతులను ఆర్థికశాఖ తగ్గించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తిని ఉటంకిస్తూ లోక్‌సభ, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులకు కూడా అందించే బడ్జెట్ ప్రతుల సంఖ్యలోనూ ప్రభుత్వం కోతపెట్టింది.