అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించినా.. గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో 24 గంటల వ్యవధిలో 88 వేల 376 కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవడం ఇదేసారి.
కరోనా టీకా పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతే కాదు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గతవారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా అమెరికాలోనే నమోదైనట్లు WHO ప్రకటించింది.
వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్ వ్యాప్తే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు మళ్లీ కొవిడ్ నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. అంతకుముందు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు.. ఇప్పుడు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలిస్తున్నాయి. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావితమైన దేశం అమెరికానే. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన మహమ్మారి.. ఇప్పటివరకు అక్కడ 6 లక్షల 12 వేల మందిని బలితీసుకుంది. దాదాపు 3 కోట్ల 5 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు.